టీడీపీ కార్యాలయానికి పొంగులేటి

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సమరం హోరా హోరీగా జరుగుతోంది. మూడు ప్రధాన పార్టీలు మెజార్టీ సీట్ల సాధించటం పైన ఫోకస్ చేసాయి. బీజేపీ అభ్యర్దుల కోసం ప్రధానితో సహా ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు.రేవంత్ 14 సీట్లలో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఖమ్మం సీటు వరకు పోరాడి సాధించిన మంత్రి పొంగులేటి ప్రచారం సమయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ మంత్రి పొంగులేటి ఖమ్మంలో టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్దిరామసహాయం రఘురామిరెడ్డితో కలిసి వెళ్లిన మంత్రి పొంగులేటి అక్కడ టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అంటూ.. మంత్రి పొంగులేటి ప్రశంసించారు.. అందుకే ఎన్టీఆర్‌ను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందని తెలిపారు. మంచి పనులు చేసిన ఎన్టీఆర్‌, వైఎస్సార్‌ను ప్రజలు గుర్తుపెట్టుకుంటారంటూ వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తెలుగు తమ్ముళ్లు మద్దతిచ్చారరని గుర్తు చేసారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పొంగులేటి టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. ఆ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. కాంగ్రెస్ కు టీడీపీ శ్రేణులు మద్దతుగా నిలిచాయి. ఇప్పుడు అదే తరహాలో లోక్‌సభ ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్ల మద్దతు కావాలి.. అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని.. తాను, ఖమ్మం అభ్యర్థి రఘురాం పోస్ట్‌కార్డు రాశామన్నారు. అటు ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తున్నారు. ఈసమయంలో కాంగ్రెస్ మంత్రి టీడీపీ కార్యాలయానికి రావటం.. తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరటం సంచలనంగా మారుతోంది. ఖమ్మంలో టీడీపీ మద్దతు పొందేందుకు కాంగ్రెస్ చేస్తున్నప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *