జాక్స్ మెరుపు సెంచరీ.. ఆర్సీబీ ఘన విజయం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ తొమ్మిది వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. విల్ జాక్స్ (100*, 41 బంతుల్లో, 5×4, 10×6) అజేయ మెరుపు శతకం సాధించాడు. అతడికి తోడుగా విరాట్ కోహ్లి (70*; 44 బంతుల్లో, 6×4, 3×6) విధ్వంసం సృష్టించారు. డబుల్ హ్యాట్రిక్ ఓటములతో తర్వాత గెలుపు బాట పట్టిన బెంగళూరుకు వరుసగా ఇది రెండో విజయం.మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 200 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (84*; 49 బంతుల్లో, 8×4, 4×6), షారుక్ ఖాన్ (58; 30 బంతుల్లో, 3×4, 5×6) అర్ధశతకాలు సాధించారు. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ (1/23), మాక్స్‌వెల్ (1/28), సిరాజ్ (1/34) తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో బెంగళూరు ఒక్క వికెట్ కోల్పోయి 16 ఓవర్లలో విజయం సాధించింది.బెంగళూరు ఛేజింగ్ సాఫీగా సాగింది. ఆదిలో డుప్లెసిస్ (24; 12 బంతుల్లో, 1×4, 3×6) ఔటైనప్పటికీ జాక్స్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. స్పిన్‌లో కోహ్లి సిక్సర్లతో హోరెత్తించాడు. దీంతో ఆర్సీబీ పవర్‌ప్లేలో 63 పరుగులు సాధించింది. తొలుత కదురుకోవడానికి సమయం తీసుకున్న జాక్స్ కూడా గేర్ మార్చడంతో బెంగళూరు 10 ఓవర్లలో 98/1తో మెరుగైన స్థితిలో నిలిచింది.ఈ క్రమంలో కోహ్లి అర్ధశతకం సాధించాడు. అయితే విరామ సమయానికి ఆర్సీబీ విజయానికి 42 బంతుల్లో 67 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికీ జాక్స్ 25 బంతుల్లో 37 పరుగులే చేశాడు. కానీ బ్రేక్ అనంతరం విశ్వరూపం చూపించాడు. బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న అతడు 41 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఆర్సీబీ గెలుపుకు ఒక్క పరుగు అవసరమవ్వగా సిక్సర్ సాధించి మూడంకెల స్కోరును అందుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *