మన ప్రేమలన్నీ శృంగారం కోసమే : పూరి జగన్నాథ్‌

ప్రేమలో విఫలమైనతే కుంగిపోవడం ఈగో.. ఆడ, మగ మధ్య ఎట్రాక్షన్‌ ఉండేది 18నెలలు మాత్రమే..
ప్రేమకంటే కుటుంబానికి ఎక్కువ విలువివ్వాలని దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. పూరి మ్యూజింగ్స్‌లో భాగంగా మరో ఆసక్తికర వీడియోను విడుదల చేశారు. అందులో ప్రేమ గురించి వివరించారు. జీవితంలో చాలామంది ప్రేమలో విఫలమవుతుంటారు. తిండి తినాలని అనిపించదు. నిద్ర రాదు. గుండెల్లో తెలియని మంటగా ఉంటుంది. దానికితోడు మద్యానికి బానిసలుగా మారతారు. స్నేహితులు ఎంత ఓదార్చినా ఆ బాధ తీరదు. కన్నీళ్లు ధారలుగా కారుతుంటాయి. అదొక నరకం. మన ప్రేమను అమ్మాయి అర్థం చేసుకోలేదని కుంగిపోతాం. నిజానికి అదంతా ప్రేమ కాదు.. ఈగో. నీకు ఎంత ఈగో ఉంటే అంత నరకం చూస్తావు. ఇది నిజం. నీకు దక్కలేదన్న ఉక్రోశమది. ఆ అమ్మాయి వల్ల నువ్వు ఇలా పిచ్చోడిలా అయ్యావనీ అదరూ తనకు చెప్పాలి. అదే నీ ఉద్ధేశం. నిన్ను మీ అమ్మ అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఎప్పుడైనా అమ్మ కోసం ఏడ్చావా? అమ్మ కోసం కత్తిపెట్టి చేయి కోసుకున్నావా? లేదు. మన ప్రేమలన్నీ శృంగారం కోసమే. అందమైన అమ్మాయిలనే ఎందుకు ప్రేమిస్తున్నారు. కాళ్లు, చేతులు లేని వాళ్లను కూడా ప్రేమించొచ్చు కదా? నిజంగా అమ్మాయి ప్రేమిస్తే.. తన నిర్ణయాలను గౌరవించు. ప్రేమలో ఉన్నప్పుడు నీకోసం పుట్టిన దేవతలా కనిపిస్తుంది. ఆ అమ్మాయి అంగీకరించకపోతే చనిపోవాలనిపిస్తుంది. ఒకవేళ తను నిన్ను పెళ్లి చేసుకుంటే రెండేళ్లు కూడా కలిసి ఉండలేవు. మోజు తీరుతుంది. కొత్త కోరికలు మొదలవుతాయి. పెళ్లి తర్వాత ఆ అమ్మాయిని చూసే పద్ధతి మారుతుంది. సైన్స్‌ ప్రకారం ఆడ, మగ మధ్య ఎట్రాక్షన్‌ 18 నెలలు మాత్రమే ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లందరూ వేరే ఏ అమ్మాయిని చూడరని ప్రామిస్‌ చేయగలరా? చేయలేరు. ప్రేమించడం, ఇంట్లో వద్దంటే గొడవ పడడం.. ఇవన్నీ సాధారణం. మనం ఎక్కువ ఈ డ్రామాలనే ఎంజాయ్‌ చేస్తాం. ప్రేమలో విఫలమైన అమ్మాయిలను ఎక్కడైనా చూశారా? వాళ్లు ఎప్పుడూ ఏడుస్తూ ఉండరు. చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. సందర్భాన్ని బట్టి వెళ్తుంటారు. వాళ్లను చూసి మిగతా వాళ్లు నేర్చుకోవాలి. ప్రేమలో ఫెయిల్‌ అవడం ఎప్పుడూ మంచిదే. దానివల్ల మనిషి స్ట్రాంగ్‌ అవుతాడు. కానీ, ప్రేమించమని బతిమిలాడుతూ ఏడవొద్దు. ప్రేమను కోల్పోయి ఈ రోజు ఇంత ఏడుస్తున్నావు కదా.. ఒక సంవత్సరం తర్వాత ఇది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది. నిజంగా అమ్మాయి మోసం చేస్తే.. ఆ బాధను కెరీర్‌లో ముందుకెళ్లడం కోసం ఉపయోగించుకోండి. ఒంటరితనం ప్రేమ కంటే గొప్పది. ఒంటరిగా తినండి, ప్రయాణాలు చేయండి. కొన్నేళ్ల తర్వాత మిమ్మల్ని చూసి మీరే నవ్వుకుంటారు. మీ లవ్‌ ఫెయిల్యూర్‌ మీద మీరే జోకులు వేసుకుంటారు. లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్న ఎంతోమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. వాళ్లతో పోలిస్తే.. మన ప్రేమలు ఎంత? లవ్‌లో ఫెయిలైతే పిచ్చి ఆలోచనలు మానండి. మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఉందని గుర్తుంచుకోండి అని పూరి జగన్నాథ్‌ చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *