బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీపై కీల‌క నిర్ణ‌యం..

గ‌త‌కొంత కాలంగా టెస్టు క్రికెట్‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంగ్లండ్ బ‌జ్ బాల్(Buz Ball) ఆట‌తో సుదీర్ఘ ఫార్మాట్ గ‌తినే మార్చేయ‌గా.. బీసీసీఐ(BCCI) సైతం టెస్టు క్రికెట్ ఆడేవాళ్ల మ్యాచ్ ఫీజు పెంచేసింది. అంతేకాదు 147 ఏండ్ల చ‌రిత్ర క‌లిగిన టెస్టు క్రికెట్‌ను బ‌తికించేందుకు భార‌త్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి. ప్ర‌తిష్ఠాత్మ‌క‌ బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో ఐదు మ్యాచ్‌లు నిర్వ‌హించేందుకు అంగీక‌రించాయి.దాంతో, 32 ఏండ్ల త‌ర్వాత టీమిండియా, ఆసీస్‌లు ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడ‌నున్నాయి. 1991-92లో ఇరుజ‌ట్ల మ‌ధ్య చివ‌రిసారి ఐదు మ్యాచ్‌ల బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీ జ‌రిగింది. ఆ త‌ర్వాత నుంచి నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌నే నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ‘టెస్టు క్రికెట్‌ను బ‌తికించాల‌నే ఉద్దేశంతోనే ఐదు టెస్టుల సిరీస్ ఆలోచ‌న చేశాం. దాంతో, సుదీర్ఘ ఫార్మాట్‌ను అభిమానులు మున‌ప‌టిలానే ఆదరిస్తార‌ని భావిస్తున్నాం’ అని బీసీసీఐ సెక్ర‌ట‌రీ జై షా తెలిపాడు.

నాలుగేండ్లుగా టీమిండియానే 

ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత‌ టీమిండియా టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్ల‌నుంది. ఇరుజ‌ట్ల మ‌ధ్య జ‌రిగే తొలి టెస్టుకు సిడ్నీ ఆతిథ్య‌మివ్వ‌నుంది. అయితే.. గ‌త నాలుగేండ్లుగా బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భార‌త్ ఆధిప‌త్యం న‌డుస్తోంది. ఈ నాలుగు ప‌ర్యాయాలు టీమిండియానే విజేత‌గా నిలిచింది. 2018-19, 2021-22లో వ‌రుస‌గా ఆసీస్ గ‌డ్డ‌పై టీమిండియా సిరీస్ విజ‌యంతో చ‌రిత్ర సృష్టించింది. అంతేకాదు నిరుడు స్వ‌దేశంలో జ‌రిగిన బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భార‌త్ సిరీస్ విజేత‌గా అవ‌త‌రించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *